అమాత్యులను తాకిన కరెన్సీ సెగ!..

18:23 - December 2, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో ప్రజలంతా కష్టాలు పడుతున్నారు. సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఇబ్బందులెదుర్కొంటున్నారు . వీరికే కాదు.. కరెన్సీ కష్టాలు అమాత్యుల పర్యటనపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎంతో ముఖ్యమైన పనైతేతప్ప మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లడం లేదు. కరెన్సీ కష్టాలతో జిల్లాల పర్యటనలు రద్దు చేసుకుంటున్న మంత్రుల పరిస్థితిపై 10టీవీ కథనం...

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందిపడుతున్న ప్రజలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో యావత్‌ భారతదేశ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో సరిపడ నగదు లేక అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నా వాటిని తమ అవసరాలకు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. నగదు కోసం బ్యాంకుకు వెళితే నో క్యాష్‌ బోర్డులు వారిని వెక్కిరిస్తున్నాయి. దీంతో ఉసూరుమంటూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. నగదు కోసం గంటలకొద్దీ ఏటీఎంల దగ్గర బారులు తీరుతున్నారు.

మంత్రుల పర్యటనలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం
తెలంగాణలో కరెన్సీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సామాన్యులకే కాదు.... మంత్రులకూ కరెన్సీ కష్టాల సెగ తగులుతోంది. వారి పర్యటనలపైనా నోట్లరద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమాత్యుల పర్యటనలకు ఏర్పాట్లు చేయడం కోసం క్షేత్రస్థాయిలోని గులాబీ నేతలు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది.ఇక కీలక మంత్రులు జిల్లాల పర్యటనకు వస్తే.. ఈ భారం మరింత ఎక్కువవుతోంది.

ప్రచారం, జనసమీకరణకు ఇబ్బంది
మంత్రుల జిల్లాల పర్యటనకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే జనసమీకరణ, ప్రచారం బాధ్యత లోకల్‌ క్యాడర్‌దే. నోట్లరద్దుతో గతంలో మాదిరిగా ఘనంగా ఏర్పాట్లు చేయడం సాధ్యంకావడం లేదని గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. జిల్లాల్లో రాష్ట్ర స్థాయి నేత పర్యటనకు వచ్చినప్పుడు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతే అది మరో సమస్యకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిధుల సమస్యే దీనికంతటికి ప్రధాన కారణమని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

జిల్లాల పర్యటనను రద్దు చేసుకుంటున్న అమాత్యులు
క్షేతస్థాయిలో క్యాడర్‌ పడుతున్న కరెన్సీ కష్టాలను గుర్తించిన మంత్రులు తమ జిల్లాల పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యమైన పనైతేనే జిల్లాలకు వెళ్తున్నారు. కరెన్సీ కష్టాలు తీరే వరకు మంత్రులు తమ పర్యటనలను ఆచితూచి ఖరారు చేస్తున్నారన్న చర్చ గులాబి దళంతో జరుగుతోంది.

Don't Miss