ఉత్తరాదిన 'బతుకమ్మ'..

14:04 - December 7, 2016

హైదరాబాద్ : బతుకమ్మ పాటలతో హర్యానా రాష్ట్రం హోరెత్తనుందా? తెలంగాణ బోనాల సంబురాలు.. ఉత్తరాదిన సందడి చేయనున్నాయా? తప్పెటగుళ్లు, పేరిణీ నాట్యాలతో హరితరాష్ట్రం పులకరించనుందా? తెలంగాణ సాయుధ రైతాంగ వీరగాధలు, ఒగ్గు కథలు హర్యానా రాష్ట్రంలో కనువిందు చేయనున్నాయా?

రాష్ట్ర సంస్కృతి- సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి- సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో కనువిందు చేయనున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాలు, కళలు.. హర్యానాలో వెళ్లివిరయబోతున్నాయి. బతుకమ్మ ఆటలు, బోనాల సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి.

ఏక్‌ భారత్‌ కార్యక్రమాన్ని రూపొందించిన కేంద్రం
భారతదేశం ఒక్కటేనని చాటేలా... ఏక్‌ భారత్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దేశం నలుమూలల ఉన్న సాంస్కృతిక సంపద ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునేలా...ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఒక రాష్ట్రం మరో రాష్ట్రంతో అనుసంధానం చేయబడుతుంది. తన భాగస్వామ్య రాష్ట్రంతో సంస్కృతి, కళలు, వారసత్వ సంపద సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ, హర్యానా రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం
ఏక్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది తెలంగాణ, హర్యానా రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలు సాంస్కృతికంగా సహకారం అందించుకుంటాయి. ఒక రాష్ట్రంలోని ఉత్సవాలు, పండుగలు మరో రాష్ట్రంతో పంచుకుని సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేసుకుంటాయి. ఏడాది మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఒకరి పండుగలకు మరొకరిని ఆహ్వానించడం, తమ ప్రసిద్ధ వంటకాలను భాగస్వామ్య రాష్ట్రానికి రుచి చూపించేలా కార్యక్రమ రూపకల్పన జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ వేదికగా కైట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక హర్యాణాలో ఈనెల రెండో వారంలో చారిత్రక కురుక్షేత్ర నగరానికి సంబంధించి భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తున్నప్పటికీ...సదుద్దేశంతో తలపెట్టిన ఏక్‌భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలంగాణ టూరిజంశాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటపాటలు, సంస్కృతి - సంప్రదాయాలు ఉత్తరభారతానికి పరిచయం కానుండడంపై కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss