డబ్బుల కోసం ఖాతాదారుల ఆందోళన..

15:15 - December 1, 2016

గుంటూరు : 23 రోజులుగా డబ్బుల్లేక అల్లాడుతున్న ప్రజలకు కొన్ని బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. డబ్బులున్నా.. నో క్యాష్‌ బోర్డులు పెడుతుండటంతో బ్యాంకు అధికారుల తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలోని స్టేట్‌ బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో నగదు ఉన్నా.. నో క్యాష్‌ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఒకటవ తారీఖు కావడంతో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మందడం గ్రామంలోని బ్యాంకు డబ్బులు తరలించారంటూ రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన చేశారు. దీంతో సచివాలయంలో కేబినెట్‌ సమావేశానికి హాజరవుతున్న అధికారుల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలియగానే జిల్లా రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ బ్యాంకు అధికారులు, గ్రామస్తుల వద్దకు వచ్చి.. వారికి కొంత మొత్తంలో నగదు ఇచ్చేందుకు ఒప్పించారు. గ్రామస్తుల ఆందోళనతో సచివాలయానికి తరలించిన డబ్బును వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. కూలీ పనులు చేసుకునే వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సామాన్యులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనం మండిపడ్డారు.

 

Don't Miss