డీఎస్ వున్నపళంగా వెళ్లిపోవాల్సిందే : బాజిరెడ్డి

19:28 - September 4, 2018

హైదరాబాద్ : గత కొంతకాలంగా డీఎస్ పై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన డీఎస్ కొంతకాలంగా బాగానే వున్నా..ఇటీవల కాలంలో నిజామాబాద్ నేతలు సీఎం కేసీఆర్ కు డీఎస్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వున్న పార్టీలో వుండి పరిస్థితులను చక్కబెట్టుకునే ఆలోచనలో వున్న డీఎస్ ఆలోచనలు ఏమీ జరిగేటట్టు లేవు. ఈ నేపథ్యంలో తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డీఎస్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

డీఎస్ కు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాను చెబితే చాలని అన్నారు. ఎందుకంటే, గతంలో డీఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించానని, ఈ వ్యక్తి వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పరంగా ఇరవై ఏళ్లు వెనకబడిందని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తన పైరవీలు ఇక్కడ నడవట్లేదని, తన మాట ఎవరూ వినడం లేదని భావిస్తున్న డీఎస్ లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నపళంగా, పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన ఇష్టమొచ్చిన పార్టీలో చేరాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Don't Miss