దీదీ సెల్ఫ్ గోల్ !!

21:48 - December 2, 2016

పశ్చిమ బెంగాల్ : ఆర్మీ మోహరింపు విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ అనుమతి లేకుండా రాష్ట్రంలో టోల్‌ ప్లాజాల వద్ద సైన్యాన్ని కేంద్రం మోహరించిందంటూ దీదీ చేసిన ఆరోపణలను సైన్యం తిప్పికొట్టింది. ప్రభుత్వ శాఖల అభ్యర్థన మేరకే తాము బలగాలను మోహరించామని, ఆయా విభాగాల నుంచి సంబంధిత అనుమతులు తీసుకున్నామని ఆర్మీ స్పష్టం చేసింది.

సీఎం మమతా బెనర్జీకి సైన్యం నుంచి అనుకోని షాక్‌
తమకు సమాచారం ఇవ్వకుండా పశ్చిమ బెంగాల్‌లో టోల్ గేట్ల వద్ద కేంద్రం భారీగా కేంద్ర బలగాల మోహరించిందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై సైన్యం నుంచి అనుకోని షాక్‌ తగిలింది. బెంగాల్ ప్రభుత్వ విభాగాల అభ్యర్థన మేరకే బలగాలను పంపించామని ఆర్మీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన అన్ని అనుమతులను వారం రోజుల ముందే తీసుకున్నాకే బలగాలను పంపించామని బెంగాల్ జీఓసీకి చెందిన మేజర్ జనరల్‌ సునీల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నాలుగు లేఖలను ఆయన విడుదల చేశారు.

బెంగాల్‌లో నవంబర్‌ 28,29,30 నుంచి డిసెంబర్‌ 1,2 తేదీలకు తనిఖీ వాయిదా
రొటీన్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ప్రతియేటా సైనికులను పంపే ముందు స్థానిక అధికారులు, పోలీసుల అనుమతి తీసుకోవడం సర్వ సాధారణమేనని తెలిపారు. బెంగాల్‌లో 80 డేటా కలెక్షన్‌ పాయింట్లను ఎంపిక చేశామని, ఒక్కొక్క పాయింట్‌ వద్ద ఐదారుగురు సైనికులు ఉంటారని సునీల్‌ యాదవ్‌ చెప్పారు. వీరివద్ద ఎలాంటి ఆయుధాలు కూడా ఉండవన్నారు. ఇందులో భాగంగా యుపి, బీహార్‌, జార్ఖండ్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. బెంగాల్‌లో నవంబర్‌ 28,29,30 తేదీల్లో ఎక్సర్‌సైజ్‌ చేయాల్సి ఉండగా భారత్‌ బంద్‌ కారణంగా డిసెంబర్‌ 1,2 తేదీలకు వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఆర్మీ వివరణతో ఖంగుతిన్న మమత
ఆర్మీ వివరణతో మమత ఖంగుతిన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలు మొహరించారని హడావుడి చేసిన ఆమె సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్టైంది. ఇప్పుడెలా స్పందిస్తారో వేచి చూడాలి.

Don't Miss