వైసీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి...

06:44 - August 29, 2018

నెల్లూరు : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల అభీష్టం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2న విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం చోడవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సూచించిన చోటు నుంచే పోటీ చేస్తానన్నారు ఆనం రామనారాయణ రెడ్డి.

ఇప్పటికే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయిన ఆనం.. వైసీపీలో చేరికపై చర్చించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిలతో చర్చించి.. తనతో ఎవరెవరు వచ్చేది వివరించారు. కాగా.. ఆనంతో .. ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. తన అన్న కుమారులు ఆనం రంగమయూర్ రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి ఆనం రాంనారాయణరెడ్డితో వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏసీ సుబ్బా రెడ్డి జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. అలాగే రాంనారాయణరెడ్డి తమ్ముడు ఆనం విజయకుమార్ రెడ్డి ఇప్పటికే వైసీపిలో ఉండగా.. మరో సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అటు టీడీపీ జిల్లా అధిష్ఠానం కూడా ఆనం వెంట వెళ్లే వారిని అడ్డుకుంటోంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున ఆనం వైసీపీలో చేరతారన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ ఆనం వైసీపీ అధినేత ముందుంచిన డిమాండ్ల వల్లే ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గ టికెట్‌, మంత్రి పదవితోపాటు.. నెల్లూరు మేయర్ అభ్యర్థి ఎంపికలో కూడా తన ప్రాధాన్యం ఉండాలన్న డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. దీనికి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ నేతలు బాలినేని, సజ్జల రామ కృష్ణారెడ్డితో కలిసి ఆనం సుమారు గంటసేపు జగన్‌తో చర్చించాకే ఆనం చేరికపై స్పష్టత వచ్చింది. క్యాడర్‌తోపాటు.. అనుచరగణంతో వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు ఆనం. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి లేదా.. ఆత్మకూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . మొత్తానికి ఆనం రాకతో జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

Don't Miss