విద్యుత్‌ చార్జీల పిడుగు

07:51 - December 4, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే చార్జీలు ఏమేరకు పెంచాలన్న విషయంలో స్పష్టత లేదుగానీ.. చార్జీలు పెంచడం అయితే ఖాయంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉదయ్‌ పథకంలో ఏపీకూడా చేరడంతో.. ఉదయ్‌ పథకం నిబంధనల ప్రకారం ప్రజలపై భారం తప్పదంటున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు.   
విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలు 
ప్రజలపై విద్యుత్‌ భారం మోపడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెంపు ప్రతిపాదనలు ఉంచాయి. విద్యుత్‌  రంగానికి సంబంధించి  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్‌ పథకం అమలు చేస్తే... చార్జీలు పెరగడం తప్పదు. ఉదయ్‌ స్కీం నిబంధనల ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలకు కనీసం మూడున్నరశాతం పెంచాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో కరంటుబిల్లులు పెరగడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో ఉన్నందున పెంచే చార్జీల భారం పూర్తిగా సాధారణ వినియోగ దారులపై పడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7వేల 177కోట్ల రూపాయల లోటుతో వార్షిక  అంచనాలను వేశాయి పంపిణీ సంస్థలు. తాజా అంచాలను ఏపీఈఆర్సీకి కూడా అందించడంతో లోటును పూడ్చుకోడానికి ఎంతశాతం పెంచాలన్నదానిపై స్పష్టత రావడమే ఆలస్యం.. కరంటు చార్జీలు మోతెక్కనున్నాయి. చార్జీల పెంపును సరికాదంటున్నాయి.. ప్రజాసంఘాలు.
సబ్సిడీ ఇవ్వడం అనుమానమే..!
అయితే నష్టాల్లో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంపై ఉన్నతాధికారుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో పెంచబోయే చార్జీలు యూనిట్‌కు 65పైసల నుంచి రూపాయిదాకా పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలు పెంచితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఏర్పడతాయని, పరిశ్రమలు మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద త్వరలోనే ఏపీ  ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో పిడుగుపడనుందని తేలిపోవడంతో.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 

Don't Miss