ఎపిలో నగదు రహిత లావాదేవీలు...

07:49 - December 3, 2016

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలు వేగవంతం చేసేందుకు ఏపీ సర్కారు ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బ్యాంకు అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు..దీని విషయమై  కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ 2వేల 420కోట్ల రూపాయలు పంపింది. దీంతో నగదు రహిత లావాదేవీల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం 
నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా ఏపీ సర్కారు చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ప్రజల అవసరాలకు సరిపడ నగదును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2వేల 420కోట్ల రూపాయలను రాష్ట్రానికి పంపింది. ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ నగదు... ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కొత్త కరెన్సీని జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.  అవసరాలను బట్టి కొన్ని జిల్లాలకు రూ.240 కోట్లు, కొన్ని జిల్లాలకు రూ.160 కోట్లు కేటాయించినట్లు సమాచారం. 
నగదు రహిత లావాదేవీలు వేగవంతం : నెల్లూరు కలెక్టర్
సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేస్తున్నట్లు నెల్లూరు కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం జిల్లాలో ఇప్పటివరకూ 2800 కోట్లు డిపాజిట్ రూపంలో...మరో 698 కోట్ల రూపాయల నగదు చెల్లింపులు అయ్యాయన్నారు. బ్యాంకుల్లో నగదు లేదని ..జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 160 కోట్ల రూపాయల కొత్తనోట్లు వచ్చాయని...ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంకుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు వేగవంతం చేసేందుకు ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోన్న సర్కారు..మరిన్ని చర్యలతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెడీ అవుతోంది. 

 

Don't Miss