వెలగపూడి నుంచి పూర్తిస్థాయిలో పాలన

07:46 - December 1, 2016

విజయవాడ : ఏపీ పాలన ఇక వెలగపూడి సచివాలయం నుంచే పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తన కార్యాలయంలో అమరావతి నిర్మాణంపై సమీక్ష జరిపారు. రాజధాని నిర్మాణంలో కీలక రింగ్‌రోడ్ల నిర్మాణంపై చర్చిఆంచారు. వెలగపూడి నుంచి పూర్తి స్థాయి పాలన సాగిస్తామని ఆయనీ సందర్భంగా చెప్పారు.
కొత్త శకం మొదలైంది : సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వెలగపూడిలో సచివాలయానికి వచ్చారు. ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. రాజకీయ కారణాలతో హేతుబద్ధత లేకుండా తమను అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించి వెళ్లగొట్టారని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. తక్కువ కాలంలోనే సచివాలయాన్ని నిర్మించుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి కేంద్రంగా అమరావతి నిర్మాణంలో ఉద్యోగులంతా కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వేలకోట్ల లోటు బడ్జెతో.. హైదరాబాద్‌ నుంచి  వచ్చామన్నారు చంద్రబాబు. హైదరాబాద్‌ ను అభివృద్ధి పథంలో నడిపిన విధంగానే... అమరావతిని ప్రపంచమే ఆశ్చర్యపడేలా నిర్మిస్తామన్నారు. నవ్యాంధ్ర చరిత్రలో కొత్త శకం మొదలైంది అన్నారు  ఏపీ ముఖ్యమంత్రి.
అమరావతికి అవకాశాలు : సీఎం చంద్రబాబు 
ప్రపంచంలో ఏ రాజధానికి లేనన్ని అకర్షణలు, అవకాశాలు అమరావతికి ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు  ఆహ్లాదంగా వుండే పర్వత శ్రేణులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం  కష్టమనిపించినా.. భవిష్యత్తులో సుందరమైన రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు సీఎం. రాజధానిలో అంతర్గత రహదారులు.. రింగ్‌ రోడ్లు ఎలా ఉండాలన్న అంశంపై కూడా ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని చుట్టూ మూడు రింగ్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను  అధికారులు సీఎంకు అందించారు. మొదటి రింగ్‌రోడ్డు ప్రధాన రాజధానికి  15 కిలోమీటర్ల దూరంలో 94 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందన్నారు. ఇక రెండవ రోడ్డు రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలో 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. అలాగే మూడవ రింగ్‌రోడ్డు  34కిలోమీటర్ల దూరంలో పలు గ్రామీణప్రాంతాలను కలుపుతూ 210 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.  
ఉద్యోగులను ప్రశంశించిన సీఎం
సచివాలయ ఉద్యోగులు ఎన్ని సమస్యలు ఉన్నా కష్టపడి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రజలకు శక్తివంచన లేకుండా సేవచేయాలన్నారు సీఎం  చంద్రబాబు.  సచివాలయంలో జరిగిన సమీక్షలో  ముఖ్యమంత్రితోపాటు మంత్రులు యనమల రామకృష్ణడు, నారాయణతోపాటు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

 

Don't Miss