బాబు సరికొత్త వ్యూహం?!..

15:52 - December 2, 2016

విజయవాడ : నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై చంద్రబాబు రూటు  మార్చారా..నియోజకవర్గాల పెంపు విషయంలో సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నారా..ఇటు సొంత పార్టీని బలోపేతం చేస్తూనే...అటు గ్రూపు తగాదాలకు చెక్‌ పెట్టేందుకు పక్కాప్లాన్‌ సిద్ధం చేశారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై రూటు మార్చిన బాబు
ఎన్నో రాజకీయ వ్యూహాలు..ప్రతివ్యూహాలు రచించడంలో అపర చాణక్యుడిగా పార్టీ వర్గాలు చెప్పుకునే చంద్రబాబు...మరో పదునైన అస్త్రాన్ని సంధించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగురాష్ట్రాల్లోనూ అధికార పార్టీలోకి భారీగా వలసలు వచ్చి చేరాయి. విభజన చట్టం పుణ్యమా అని..ఇరు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశం ఉందని పార్టీలు భావించాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెరిగిన స్థానాల్లో సీట్లు కేటాయించవచ్చనే ఆలోచనతో..అధికార పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయి.

సీట్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకూడదని నిర్ణయించుకున్న బాబు
అయితే ప్రస్తుతం నియోజక వర్గాల పెంపు డిమాండ్‌ను తెరమరుగు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తేకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చాలా చోట్ల వైసీపీ అస్తిస్తత్వం గల్లంతయ్యే పరిస్థితి ఉందని టీడీపీ నేత అంచనా వేస్తున్నారు. అలాంటప్పడు నియోజకవర్గాల పెంపు వైసీపీకి అనుకూలంగా మారితే ప్రమాదమని భావిస్తున్నారు. అందుకే ఉన్న నియోజకవర్గాలోనే పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.

23 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
మరోవైపు రాష్ట్రంలో భారీగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థలను కలుపుకొని 23 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటిలో టీడీపీ అత్యధికంగా 20 స్థానాల వరకూ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటినీ పార్టీలోని అసంతృప్తి నేతలతో భర్తీ చేస్తే..సమస్య పరిష్కారమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో గ్రూప్‌ తగాదాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు, గ్రూప్‌ తగాదాలకు చెక్‌ పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు ప్లాన్‌ ఏ మేరకు విజయవంతమమవుతుందో వేచి చూడాలి. 

Don't Miss