అమ్మకు చికిత్సనందిస్తున్న ఎయిమ్స్ వైద్యులు..

13:50 - December 5, 2016

తమిళనాడు : ఎయిమ్స్ వైద్యులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ కిలానీ..రాజీవ్..అంజన్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లు అపోలో ఆసుపత్రికి చేరుకుని క్షణక్షణం జయలలిత ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. ఎక్మో(ఈసీఎంవో) సిస్టం, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ద్వారా జయకు చికిత్స చేస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన జయను ఐసీయూలో ఉంచి జయకు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. లండన్ వైద్యులు రిచర్డ్ బేలే సలహాలు, సూచనలతో ఎయిమ్స్ వైద్య బృందం, అపోలో డాక్టర్లను జయను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విషమంగా ఉన్న జయ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు సమీక్షిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల పనిని ఏకకాలంలో నిర్వహించే అత్యంత అధునాతన యంత్రం ఎక్మో(ఈసీఎంవో) ద్వారా చికిత్స అందిస్తున్నారు.

హెల్త్ బులెటిన్ తో కార్యకర్తల్లో ఆందోళన
హెల్త్ బులెటిన్ కోసం ఎదురుచూసిన అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని హెల్త్ బులెటిన్ వస్తుందనుకున్న అభిమానుల్లో నిరాశ నెలకొంది. అమ్మ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించడంతో ఆ విషయాన్ని జయ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

పోలీసుల దిగ్భంథంలో అపోలో ఆసుపత్రి
సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆపోలో ఆసుపత్రిని పూర్తిగా తమ అధీనంలోకి స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క కేంద్రం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. చెన్నైకి జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల తాకిడి గంటగంటకు పెరుగుతుండటంతో కేంద్రం మరిన్ని భద్రతా దళాలను రాష్ర్టానికి పంపించింది. కోయంబత్తూర్‌లో పోలీసుల భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే కేంద్రం తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. ఈనేపథ్యంలో సాయంత్రం 4..6 గంటలకు మరో హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. జయలలిత ఆనారోగ్యం పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తున్న క్రమంలో ఆమె అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశముండటంతో ప్రభుత్వం మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 

Don't Miss