జగదీశ్వర్‌రెడ్డి ఇంట కాసుల పంట...

07:41 - April 21, 2017

విజయవాడ : వజ్రాలు పొదిగిన కంటాభరణాలు.. ఔరా అనిపించే వడ్డాణాలు..మిరుమిట్లు గొలిపే పచ్చల హారాలు.. ఇలా ఒకటేమిటి... ఏసీబీకి పట్టుబడ్డ ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజినీర్‌ బి.జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు తవ్వే కొద్దీ బయపడుతున్నాయి. బయటపడుతున్న బంగారు ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులు నివ్వెరపోతున్నారు.
మొత్తం ఎనిమిది లాకర్లు..
ఏసీబీ దాడుల్లో భాగంగా జగదీశ్వర్‌రెడ్డి భార్య, ముగ్గురు కుమార్తెల పేరిట మొత్తం ఎనిమిది లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిల్లోనూ కొటక్‌ మహీంద్ర, ఆంధ్రాబ్యాంకుల్లోని మొత్తం 5 లాకర్లను అధికారులు తెరిచారు. బాగ్ అంబ‌ర్ పేట్, రామంతాపూర్‌లోని ఆంధ్రాబ్యాంకులు, ఉప్పల్‌లోని కొట‌క్ మ‌హింద్రా బ్యాంకుల్లోని లాకర్లను ఓపెన్‌ చేశారు. వాటిల్లో 3 కిలోల బంగారు ఆభరణాలు, రూ.38 లక్షల నగదు లభ్యమైంది. బంగారు ఆభరణాల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క బాగ్ అంబర్ పేట్ ఆంధ్రాబ్యాంక్‌ లాకర్‌లోనే కేజీన్నర బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమాస్తుల గుర్తింపు వేగవంతం 
4 రోజుల క్రితం ఏసీబీకి చిక్కిన విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు గుర్తించడంలో అధికారులు స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏక‌కాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి సుమారు 20 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించారు.

 

 

Don't Miss