సంక్రాంతికి 5 వేల 252 ప్రత్యేక బస్సులు  

Submitted on 12 January 2019
5,252 special buses for Sankranthi in telangana

హైదరాబాద్ : సంక్రాంతికి నగరవాసులు పల్లె బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 5,252 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వివిధ రూట్లలో 11 నుంచి 16 వరకు నడుపాలని నిర్ణయించింది. ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 3 వేల 673, సీమాంధ్ర ప్రాంతానికి 1,579 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 3 వేల 400 బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసి కరీంనగర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు సిటీ బస్సులను కూడా నడుపుతోంది. స్పెషల్ సర్వీసుల పేరుతో ఆర్టీసీ 50 శాతం అదనంగా వసూళ్లు చేస్తోంది.

జేబీఎస్ నుంచి కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాల వైపు ప్రతిరోజూ వెళ్లే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఎంజీబీఎస్ నుంచి కర్నూలు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లికి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. కాచిగూడ నుంచి నంద్యాల, ఆత్మకూరు (కే), వెలుగోడు, నందికొట్కూరు, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, అవుకు, బుద్వెల్, జమ్మలమడుగు, పొద్దుటూరు, పులివెందుల, కడప, రాజంపేట, రాయచోటి, కోడూరు, చిత్తూరు వైపు రోజువారీ బస్సలకు అదనంగా ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయి. 

ఉప్పల్ క్రాస్‌రోడ్డు, ఉప్పల్ బస్‌స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట, వరంగల్ వైపు వెళ్లే బస్సులు తిరుగుతాయి. దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్ నుంచి మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ, సూర్యాపేటకు బస్సులు తిరుగుతాయి. విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఎల్బీనగర్ నుంచి నడుపుతున్నారు.
 

5
252 special buses
Sankranthi
Telangana
Hyderabad

మరిన్ని వార్తలు