కల్కి ఆశ్రమంలో రూ.409 కోట్ల డబ్బు

Submitted on 19 October 2019
409 crores of money in Kalki ashramam

కల్కి ఆశ్రమంలో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరులోని 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 43.9 కోట్లతో పాటు 1,182 స్థిరాస్తి పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18 కోట్ల విలువైన యూఎస్‌ డాలర్స్‌... 5 కోట్ల విలువైన వజ్రాల్ని సీజ్‌ చేశారు. 2014-15లో దాదాపు 409 కోట్ల ఆదాయానికి లెక్క చూపలేదని ఐటీ అధికారులు తేల్చారు. అలాగే భక్తుల నుంచి సేకరించిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారించారు. చైనా, అమెరికా, అరబ్‌ ఎమిరేట్స్‌తో, సింగపూర్‌లోని రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్తున్నారు. అలాగే ఏపీ, తమిళనాడులో కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారని గుర్తించారు. మరోవైపు నాలుగు రోరజులుగా కల్కి దంపతులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.

కల్కి మహా సామ్రాజ్యపు కోటకు బీటలు వారుతున్నాయి. నాలుగు రోజులుగా సాగుతున్న సోదాల్లో కట్టల గుట్టల్ని తవ్వుతున్న ఐటీ అధికారులు... కల్కి లోగుట్టును రట్టు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 400మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. వరదాయపాలెంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. కల్కి భగవాన్‌ తనయుడు కృష్ణాజీ, ఆయన భార్య ప్రీతీజీ, ట్రస్ట్ సీఈఓ లోకేశ్‌ దాసాజీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మూడురోజు సోదాల్లో కల్కి కూడబెట్టిన అక్రమాస్తుల వివరాలు బయటపడ్డాయి. దాదాపు 5కోట్లకు పైగా లెక్కచూపాని ఆదాయాన్ని గుర్తించారు. ఐదేళ్ల కాలంలో వందలకోట్లు దారి మళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. కీలకపత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 62కోట్ల విలువైన దేశ, విదేశీ నగదుతో పాటు 88 కిలోల బంగారం దొరికింది. 5కోట్ల రూపాయలకు పైగా విలువైన వజ్రాలు దొరికాయి. భారత్‌తో పాటు విదేశీ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన పత్రాలు దొరికాయి. 

చైనా, అమెరికా, సింగపూర్‌, UAE కంపెనీల్లోకి నిధులు తరలించినట్లు చెబుతున్నారు. కొన్ని పత్రాలు అధికారులకు దొరక్కుండా తగలబెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కల్కి ఆశ్రమాల్లో విదేశీ నగదును అనధికారికంగా ఎక్స్‌చేంజ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. విదేశీ భక్తుల నుంచి ఆయాదేశాల కరెన్సీ తీసుకుని వారికి భారత నగదును ఇస్తున్నారన్న ఆధారాలు సంపాదించారు.

ఇంకా భారీగా అక్రమాస్తులున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆశ్రమ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారిలో కొందరు కోడ్‌ సంకేతాలతో మెసేజ్‌లు పంపుకున్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని కృష్ణాజీకి చేరాయి. దీంతో వాటి గుట్టు విప్పే పనిలో పడ్డారు. ఇవన్నీ కూడా విదేశీ కరెన్సీ లావాదేవీలకు సంబంధించినవని భావిస్తున్నారు. కల్కి కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో వెయ్యికోట్లతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నడుపుతున్నట్లు అనుమానాలున్నాయి. కల్కి భగవాన్‌కు స్విస్‌ బ్యాంకులో ఎకౌంట్ ఉందని అందులో వేలకోట్లున్నాయని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో వందల ఎకరాల భూములున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. 
 

409 crores
Money
Kalki ashramam

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు