40 మంది మృతి...

13:24 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు..వారికి మృత్యుదారి అయ్యింది. ఆంజనేయ స్వామిని దర్శించుకుని సంతోషంగా తిరుగు ప్రయాణమయిన వారు విగతజీవులుగా మారిపోయారు. సంతోషంగా ఉండాల్సిన వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద లోయలో ఆర్టీసీ బస్సు పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, పిల్లలున్నారు. సహాయక చర్యల్లో స్థానికులు పాల్గొన్నారు. 

కొండగట్టు మీద నుండి కిందకు వస్తున్న సమయంలో మూల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకలు ఫెయిల్ కావడంతో ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. దీనితో మృతుల బంధువులు ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సింధు, కలెక్టర్ శరత్ చేరుకుని ఆరా తీశారు. 

Don't Miss