ఆర్టీసీ సమ్మె 20వ రోజు : కొనసాగుతున్న నిరసనలు

Submitted on 24 October 2019
20th day of TS RTC strike

ఆర్టీసీ సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం..తదితర డిమాండ్లతో అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కానీ అరకొరగా ఉంటుండడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నియమించిన ఆరుగురు ఆర్టీసీ అధికారుల బృందం కార్మికుల డిమాండ్లలోని 21 అంశాల అమలు సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేపట్టారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఆర్టీసీ కార్మికుల నిరసనలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు హోరెత్తాయి. నిరసనలు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో ధర్నాలు చేసేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం మొత్తం 5 వేల 912 బస్సులు తిరిగినట్లు తెలుస్తోంది. కార్మికులకు సంఘీభావంగా అద్దె బస్సుల యజమానులు కొన్ని సర్వీసులను నిలిపివేశారు. 

ఇదిలా ఉంటే..కోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించేందుకు సీఎం ఆదేశంతో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఆర్టీసీ అధికారుల కమిటీ..బుధవారం మధ్యాహ్నం సమావేశమైంది. కార్మికుల కీలక డిమాండ్ డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించారు. గురువారం మరోసారి భేటీ కానున్నారు. అదే రోజు రాత్రి..లేదా శుక్రవారం కానీ ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మకు నివేదిక సమర్పించనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అవే వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. 

సీఎం ఆదేశంతో కొత్తగా మరో వెయ్యి బస్సులను అద్దెకు తీసుకొనేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నార. మూడు రోజుల కిందటే..వెయ్యి బస్సులకు అధికారులు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. అందులో జిల్లాల్లో 275 బస్సులకు 9 వేల 700 టెండర్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 725 బస్సులకు 18 మాత్రమే దాఖలయ్యాయి. 
Read More : తీపి కబురు : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

20th day
TS RTC
Strike
KCR speech
Bus Route
Fare

మరిన్ని వార్తలు