ఏసియాడ్‌ గేమ్స్‌ సంరంబం

21:20 - August 18, 2018

ఇండోనేషియా : జకర్తా వేదికగా ఏసియాడ్‌ గేమ్స్‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా సమరానికి ఇండోనేషియా రెండోసారి ఆతిథ్యమిస్తోంది. 16 రోజుల పాటు ఈ మెగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాల నుండి 11వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది భారత్‌. టాప్‌-5 స్థానమే లక్ష్యంగా క్రీడా సమరంలో పాల్గొనబోతోంది. 
45దేశాల నుంచి 11వేల మంది అథ్లెట్లు  
ఆసియా క్రీడల్లో 45దేశాల నుంచి దాదాపు 11వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. భారత్‌ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆరంభ వేడుకలో భారత్‌ తరఫున జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా త్రివర్ణ పతాకంతో కవాతు చేశాడు. భారత బృందంలో 311 మంది పురుషులు, 260మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. పోటీలు ఆదివారం మొదలవుతాయి.
భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు 
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకుంటున్నారు. రెజ్లింగ్, బాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, బాక్సింగ్, జిమ్నాస్టిక్, టేబుల్ టెన్నిస్ తదితర అంశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గత ఒలింపిక్స్ పోటీల కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారనే గట్టి నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రెజ్లింగ్ నుంచి బజరంగ్ పూనియా, సుశీల్ కుమార్, మహిళల విభాగం నుంచి వినేష్ ఫొగట్ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నారు. ఇక బాడ్మింటన్ నుంచి పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్‌పై ఆశలు పెట్టుకున్నారు. అటు షూటింగ్ నుంచి మనూ బాకర్, అథ్లెటిక్స్ నుంచి హిమ దాస్, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, డిస్కస్ త్రోలో సీమా పూనియా, టెన్నిస్‌లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ, బాక్సింగ్ నుంచి వికాస్ కృష్ణన్, జిమ్నాస్టిక్స్‌-దీపా కర్మాకర్‌, టేబుల్ టెన్నిస్‌ నుంచి మనీకా బాత్రా మెడల్స్‌ తెస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 
విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
ఆసియా క్రీడల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాప్‌ సింగర్‌ వియా వాలిన్‌ సాంగ్‌కు వీక్షకులను ఉర్రూతలూగించింది. ఏసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా కళాకారులు ప్రదర్శించిన యుద్ధరీతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా మత్స్యకారుల సాంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసియా క్రీడల్లో ఇండోనేషియా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపించారు.

 

Don't Miss