కరోనా మరణమృదంగం : ప్రపంచవ్యాప్తంగా 1,526 మంది మృతి

Submitted on 15 February 2020
1,526 people died in worldwide with Coronavirus

ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైద్య పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మృతుల సంఖ్యకు అడ్డకట్టపడటంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది. చైనాలో శుక్రవారం ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 143 మంది ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో 2వేల 641 మంది ఈ వైరస్ బారినపడ్డారు. డ్రాగన్ కంట్రీలో మొత్తం 66వేల 492మంది కరోనా బాధితులుండగా.. వారిలో 11వేల 82మంది పరిస్థితి విషమంగా ఉంది.

కరోనా వైరస్ కారణంగా చైనాలోని అనేక పట్టణాలు, నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోజువారీ అవసరాలకు కూడా ప్రజలు రోడ్లమీదికి రావడానికి వణికిపోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. అన్నిరకాల రవాణా సాధనాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో అక్కడి ప్రజలు వ్యక్తిగత కార్లను కూడా వినియోగించడంలేదు. దీంతో అనేక ప్రాంతాలు ఘోస్ట్‌టౌన్లుగా తయారయ్యాయి. 

కరోనా వైరస్‌ అనుమానంతో జపాన్‌ తీరంలో నిలిపేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలోని 3వేల711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా... వారిలో ముగ్గురు భారతీయులుండటం ఆందోళన రేపుతోంది. ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని ప్రయాణికుల్లో...కరోనా సోకినట్లు నిర్ధారించిన 11 మంది వృద్ధులను జపాన్‌ అధికారులు బయటకు పంపించారు. మరోవైపు... టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు ఈ వైరస్ బారినపడి మృతి చెందినట్లు జపాన్‌ తెలిపింది.

భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే...  చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్‌ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. మరోవైపు.. చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడగా... అందులో ఒకరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

ఇటు... తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నిర్ధారణ కాలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఓ వ్యక్తి  వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఒక్కరికి కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని.. కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఈటల అన్నారు.

Read Here>>మనసుకి నచ్చిన అమ్మాయితో నితిన్ నిశ్చితార్థం!

1
526 people
died
worldwide
coronavirus

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు