జయ వ్యక్తి కాదు..శక్తి..

20:51 - December 6, 2016

ఒక శకం ముగిసింది.. దేశ రాజకీయాల్లో ఓ ఉక్కు మహిళ నిష్క్రమించింది. పురుషాధిక్య సమాజం.. ఓ మహిళ సమాజంలో నిలదొక్కుకోవటానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసిన సమయం.. కానీ, ఆమె అడ్డుగోడలను బద్ధలు కొట్టారు.. ప్రత్యర్ధులను చిత్తు చేశారు. గమ్యాన్ని చేరారు. తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో మలుపులు.. ఆ ప్రస్థానంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం.. మామూలు నటి కదా అనుకున్నారు.. కానీ, పార్టీనే శాసించింది. ఓ మహిళ రాజకీయాల్లో ఏం చేస్తుందనుకున్నారు. నిండు సభలో అవమానాలు కూడా చేశారు. కానీ శపథం చేసి మరీ పీఠాన్ని అధిరోహించారు. నటిగా, పార్టీ నేతగా, సీఎంగా జయలలిత దశాబ్దాలపాటు తమిళనాడు రాజకీయాల్లో భాగమయ్యారు. అపారమైన ప్రతిభ..సాధించాలనే పట్టుదల..గమ్యంవైపు పరుగులు తీసే దృఢత్వం.. అంతులేని ఒంటరితనం..కరగని మొండితనం.. జయలలితలో కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాలు.. చిన్నతనం నుండి 75 రోజులు ఆసుపత్రిలో పోరాడేంత వరకు ఇదే తీరు కొనసాగింది.

రూటే సపరేటు..
నమ్మిన బంటుకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కటకటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సపరేటు. కరుణిస్తే అమ్మ...టార్గెట్ చేస్తే అపరకాళి. తమిళనాడు రాజకీయాల్లో అమ్మగా ఆదరణ పొందిన జయలలిత నిర్ణయాలు తీసుకోవటంలో సాహసి..ఎంత దూరమైనా వెళ్లటానికి వెనుకాడని మనస్తత్వం. ఆమె తీసుకునే నిర్ణయాలతో ప్రజలతో పాటు ప్రత్యర్థులు సైతం షాక్‌ తినేవారు. అమ్మ రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్లు.. వాటిని ఆమె ఎన్నో ఎదుర్కొన్నారు.

జయలలిత లేదు...
ఇప్పుడు జయలలిత లేదు.. తమిళ తంబిలు అమ్మా అని పిలుచుకునే వ్యక్తి భౌతికంగా లేదు. కానీ, ఆమె ఇచ్చిన స్ఫూర్తి పంచిన మంచితనం ఉంది. కానీ, ఒక్కటే సందేహం.. జయలలిత కేంద్రంగా సాగిన రాజకీయాలు ఇప్పుడొక్కసారిగా రాజకీయ శూన్యతలో పడే అవకాశముందా? తమిళనాడు పాలిటిక్స్ ఏ మలుపు తీసుకోబోతున్నాయి? మహాశక్తిలాంటి వ్యక్తి నిష్క్రమిస్తే కలిగే శూన్యాన్ని ఊహించటమే కాదు. దాన్ని నింపటం కూడా కష్టమే. పన్నీర్ సెల్వం జయకు ప్రత్యామ్నాయంగా ఎదగగలడా? లేక మరో నటుడు అవసరమౌతాడా? అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఇదంతా ఇప్పటికి ప్రశ్నే. కానీ, కాలం ఎవరికోసం ఆగదు. ఎవరి నిష్క్రమణతోనూ నిమిత్తం లేకుండా ప్రపంచం సాగుతూ ఉంటుంది. అలా ప్రపంచాన్ని వదిలిన వారి జ్ఞాపకాలు ..అందించిన స్ఫూర్తి మాత్రం ముందు తరాలకు అందుతూ ఉంటుంది.

Don't Miss