గోల్డ్ ఎవరి వద్ద ఎంతుందో తెలుసా?!

19:44 - December 2, 2016

ఢిల్లీ : మన దేశంలో ఎంత బంగారం వుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంత వుంది? ప్రజల దగ్గర ఎంత వుంది? దేవుళ్ల దగ్గర ఎంత వుంది? మనకు ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తోంది?

ప్రపంచం ఉత్పత్తి చేస్తున్న బంగారంలో భారత్ వాటా కేవలం 0.75శాతం
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బంగారం చాలా స్వల్పం. ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న బంగారంలో మన వాటా కేవలం 0.75శాతం మాత్రమే. అయితేనేం బంగారు నగలు ధరించడంలో మనమే టాప్. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11శాతం మనదేశంలో వుంది.

భారత్ లో 20,000 టన్నుల బంగారం
మనదేశం మొత్తం మీద ఎంత బంగారం వుంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన సమాచారమేదీ లేదు. ఎవరిదగ్గర ఎంతెంత బంగారం వుందన్న లెక్కలు ప్రభుత్వాలు ఎప్పుడూ సేకరించలేదు. కానీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం మన దేశంలో దాదాపు 20,000 టన్నుల బంగారం వుంది. ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు. 20వేల టన్నులంటే 2 కోట్ల కేజీల బంగారం. మన దేశ జనాభా 125 కోట్లు. మన దేశంలో వున్న బంగారం మొత్తాన్ని ఒక చోట కుప్పగా పోసి, అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి కి తులంన్నర చొప్పున ఇవ్వొచ్చట.

10 వ స్థానం భారత్ 557.7 టన్నులు
మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర వున్న బంగారం 557.7 టన్నులు. బంగారం నిల్వల విషయంలో మన దేశానిది పదవ స్థానం. అమెరికా దగ్గర అత్యధిక నిల్వలున్నాయి. 8133.5 టన్నుల నిల్వలతో అమెరికా మొదటి స్థానంలో వుంది. 3384.2 టన్నుల నిల్వలతో జర్మనీ రెండో స్థానంలో వుంది. 2451.8 టన్నులున్న ఇటలీది మూడో స్థానం. ఫ్రాన్స్ 4వ స్థానంలో, చైనా 5వ స్థానంలో, రష్యా 6వ స్థానంలో, స్విట్జర్లాండ్ 7వ స్థానంలో వున్నాయి. జపాన్, నెదర్లాండ్స్ కూడా మన పై స్థానాల్లో వున్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర 557.7 టన్నులు
మన రిజర్వ్ దగ్గర ప్రస్తుతం 557. 7 టన్నుల బంగారం నిల్వ వుంది. గత పదహారేళ్ల కాలం లెక్కలు తీస్తే, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర సగటున 441.33 టన్నుల బంగారం నిల్వ వుంటోంది. కానీ, మన దేశం మొత్తం మీద వున్న బంగారం 20వేల టన్నులు. ఇందులో కొంత భాగం ఆలయాల్లో వుంది. దేశంలోని అన్ని ఆలయాలలో కలిపి 3000 నుంచి 4000 వేల టన్నుల బంగారం వుంటుందని అంచనా. కేరళ అనంతపద్మనాభ స్వామికి 1300 టన్నుల బంగారం వుంటే, తిరుమల వెంకన్నకు దాదాపు 300 టన్నుల బంగారం వుంది. గురువాయూర్ కిట్టయ్యకు 2 టన్నుల బంగారం వుంది. వైష్ణోదేవి టెంపుల్ కి 1200 కేజీల బంగారం వుంటే, షిర్డి సాయిబాబాకు 376 కేజీల బంగారం వుంది. పూరి జగన్నాధుడికి 208 కేజీలు, ముంబై సిద్ధి వినాయకుడికి 160 కేజీలు బంగారం వుందంటూ గతంలోనే లెక్కలేశారు. తిరుమల వెంకన్నకు ఏటా వంద కేజీల బంగారం వస్తోంది. ఈ లెక్కన ఏటేటా దేవుళ్ల బంగారం భారీగానే పెరుగుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ..ఆలయాలలో కలిపి దాదాపు 5000 టన్నుల బంగారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆలయాలలో కలిపి దాదాపు 5000 టన్నుల బంగారం వుందనుకుంటే, మిగిలినది దాదాపు 15000 టన్నుల బంగారం ప్రజల దగ్గరే వున్నట్టు లెక్క. మన దేశంలో వున్న మొత్తం బంగారంలో దాదాపు 75శాతం నగల రూపంలో వుంటే, పాతిక శాతం బిస్కట్లు, కడ్డీల రూపంలో వుంటోంది.

భారత్ ఏడాదికి దాదాపు 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి
బంగారం ప్రధానంగా మూడు రూపాల్లో లభ్యమవుతోంది. వీటిలో గనుల తవ్వకాల ద్వారా అయితే, రెండోది వ్యక్తులు తమ దగ్గర వున్న బంగారాన్ని అమ్ముకుని క్యాష్ రూపంలోకి మార్చుకోవడం ద్వారా, మూడోవది వివిధ దేశాలు తమ దగ్గర వున్న బంగారాన్ని విక్రయించడం వల్ల లభ్యమవుతోంది. మన దేశం ఏటా దాదాపు 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ నవంబర్ నెలలోనే వంద టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.

1986లో ప్రత్యేకంగా బంగారు నియంత్రణ చట్టం
బంగారాన్ని స్త్రీలు ధరించే అలంకార వస్తువుగానే కాకుండా, పెట్టుబడి సాధనంగా కూడా చాలామంది భావిస్తున్నారు. బంగారం మీద పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అందుకే బంగారానికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. అయితే, బంగారాన్ని భారీగా విదేశాల నుంచి కొనుగోలు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని అదే స్థాయిలో వెచ్చించాల్సి వస్తోంది. కరెంటు ఖాతా లోటు పెరగడానికి బంగారం దిగుమతులు కూడా కారణమవుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. దీంతో ఒకానొక దశలో బంగారం దిగుమతులను నిషేధించారు. 1986లో ప్రత్యేకంగా బంగారు నియంత్రణ చట్టం కూడా చేశారు. కానీ అది సత్ఫలితాలనివ్వలేదు. బంగారం స్మగ్లింగ్ పెరిగింది. దీంతో బంగారం నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు. ఫలితంగా బంగారం దిగుమతులు పెరిగాయి.

Don't Miss