ఏపీలో 108 కి బ్రేకులు : జీతాల కోసం ఆందోళన

Submitted on 23 July 2019
108 employees strike in Andhra pradesh

అమరావతి : ఏపీ లో 108  సర్వీసులకు బ్రేక్ పడింది. పేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్‌ సేవలు సోమవారం రాత్రినుంచి  నిలిచిపోయాయి. గత 3 నెలలుగా బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్  చేస్తూ  వీటిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది  మెరుపు సమ్మెకి దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాల సేవలు నిలిచిపోయాయి. సోమవారం  జులై 22 వతేదీ రాత్రి 8గంటలకు డ్యూటీలోకి రావాల్సిన సిబ్బంది విధులను బహిష్కరించారు. జీతాలకు సంబంధించిన అంశాలపై ఉద్యోగులు, యాజమాన్యం మధ్య గత 4 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు.

దీంతో గుంటూరు, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఒకనెల జీతాలు చెల్లించారు. మిగిలిన జిల్లాల్లో ఉద్యోగులకు బకాయిలు ఇంకా చెల్లించలేదు. ఎన్ని నెలల గడువు ఇచ్చినా యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సిబ్బంది ఆందోళన చేపట్టారు.

నెలరోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. 108 అంబులెన్స్‌ల ఉద్యోగులతో చర్చిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. దీంతో అగ్రహించిన ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,200మంది ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

Andhra Pradesh
108 ambulence service
wages
salaries

మరిన్ని వార్తలు