రాహుల్ గాంధీతో భోజనం చేస్తే... ప్లేట్ కు 82,500

08:57 - September 5, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎవరైనా భోజనం చేయాలనుకుంటున్నారా అయితే 82,500 రూపాయలను సిద్ధం చేసుకోవాల్సిందే. ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీరే చూడండి. రాహుల్‌ గాంధీ ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన కార్యక్రమాల పట్ల పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ హాజరైన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్వహకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 900యూరోలు( సుమారు రూ.82,500) వసూలు చేశారు. భారత్‌కు చెందిన విలేకరులతో మాట్లాడేందుకు రాహుల్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌(ఐఓసీ‌) నిర్వహించింది. అయితే ఐఓసీ దానిని ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం మాదిరిగా నిర్వహించిందని, పార్టీ అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి నిధులు ఆ విధంగా సేకరించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటన కార్యక్రమాలకు ఐఓసీ‌ నిర్వహణ
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటనలోని దాదాపు కార్యక్రమాలను ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్సే నిర్వహించింది. పలు కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. భాజపాకు ఎక్కువ సన్నిహితంగా ఉండే కన్జర్వేటివ్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేసింది. దానికి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి సన్నిహితంగా ఉండే వ్యక్తి హోస్ట్‌ చేసేలా ప్రణాళిక వేశారు. ఐఓసీనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్లాన్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సమాచారం. దానికి బదులుగా యూకే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మరో కార్యక్రమానికి రాహుల్‌ వెళ్లేలా ప్రణాళికను మార్చారు. మరికొన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే గందరగోళంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

Don't Miss