'ముందస్తు' వేడితో సరికొత్త సమీకరణాలు

11:09 - September 6, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వేడితో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణలు నెలకొన్నాయి. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు వైరి పక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. నిన్న గోల్కొండ హోటల్ లో కుంతియా, ఉత్తమ్ తో టిటిడిపి ప్రెసిడెంట్ ఎల్.రమణ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో టిటిడిపి పొత్తుపై టీకాంగ్రెస్ అభిప్రాయాన్ని సేకరించింది. కాంగ్రెస్ తో పొత్తుకు టిటిడిపి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొత్తు కుదిరితే టిటిడిపికి 14 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత సీట్ల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
మిత్రులవుతున్న శత్రువులు 
ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అంశాలకు టీఆర్ ఎస్ తెరతీయగా ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే...మరోవైపు ముందస్తుకు సన్నదం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఈక్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకున్న వైరి పక్షాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి. గోల్కొండ హోటల్ వేదికగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈనెల 8న ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. బాబుతో భేటీకి ముందు కుంతియాతో రమణ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే కుంతియాతో భేటీ యాదృచ్ఛికమేనని రమణ అంటున్నారు. హోటల్ లో అనుకోకుండా కుంతియాను కలిశానని తెలిపారు.
ఈనెల 14న తెలంగాణలో సోనియా సభ
ఈనెల 14న తెలంగాణలో సోనియా సభ నిర్వహించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లేదా కరీంనగర్ లో సోనియా సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. ప్రస్తుతం రాహుల్ మానససరోవర్ యాత్రలో ఉన్నారు. సెప్టెంబర్ 12న యాత్ర ముగించుకుని ఢిల్లీకి రానున్నారు.

Don't Miss